Narendra Modi: సౌదీ యువరాజుకు మోదీ ఘనస్వాగతంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్
- అమరజవాన్లను ప్రధాని కించపరిచారు
- దేశప్రయోజనాలను తాకట్టుపెట్టారు
- పాక్ ను పొగిడిన వ్యక్తికి రాచమర్యాదలా?
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సుల్తాన్ కు ఘనస్వాగతం పలకడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మరీ కౌగిలించుకోవడం అవసరమా? అంటూ విమర్శించింది. పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక చర్యలు భేష్ అంటూ కీర్తించిన వ్యక్తికి ఘనంగా స్వాగతం పలకడం అమరజవాన్లకు నివాళి అనిపించుకుంటుందా? అంటూ కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు.
మోదీ తన ఆలింగన దౌత్యం కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నట్టు భావించాల్సి వస్తుందని సూర్జేవాలా ట్విట్టర్ లో మండిపడ్డారు. ఓవైపు సౌదీ యువరాజు పాకిస్థాన్ ను ప్రశంసిస్తూ 20 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారని, అలాంటి వ్యక్తికి ప్రోటోకాల్ ను కూడా పట్టించుకోకుండా ఎదురెళ్లి మరీ రాచమర్యాదలు చేయడం అంటే అమరజవాన్ల స్ఫూర్తిని తుంగలో తొక్కడమేనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు సూర్జేవాలా.