India: పాకిస్థాన్ పర్యటన ముగించుకుని భారత్ లో అడుగుపెట్టిన సౌదీ యువరాజు
- ఢిల్లీ చేరుకున్న మహమ్మద్ బిన్ సల్మాన్
- స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే పర్యటన లక్ష్యం
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ లో అడుగుపెట్టారు. మంగళవారం ఆయన పాకిస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో సౌదీ యువరాజుకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. విమానం స్టెయిర్ కేస్ వద్దకు వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ వెంట సౌదీ మంత్రులు, ఇతర ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో భారత్ పర్యటనకు విచ్చేశారు. ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మధ్య ముఖ్యంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.
అంతకుముందు, సౌదీ యువరాజు తన రెండ్రోజుల పాకిస్థాన్ పర్యటనను విజయవంతంగా ముగించారు. పాకిస్థాన్ లో అత్యున్నత పురస్కారం అయిన నిషాన్-ఏ-పాకిస్థాన్ తో సౌదీ ప్రిన్స్ ను సత్కరించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఈ పురస్కారం అందజేశారు. అయితే, పాకిస్థాన్ కు ఆయన సౌదీ తరపున 27 బిలియన్ డాలర్లు ఆర్థికసాయం ప్రకటించిన తర్వాత ఈ పురస్కారం అందించడం విశేషం.