Telangana: కర్మ కాలిన రోజున కేసీఆర్ కూడా ఊచలు లెక్కపెడతారు: రేవంత్ రెడ్డి ఫైర్

  • అప్పుడు, మోదీ కూడా ఆపలేరు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు
  • నా తల తెగిపడ్డా సరే, కేసీఆర్ అక్రమాలపై మాట్లాడతా

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని, తన తల తెగిపడ్డా సరే, కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటానని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి  మండిపడ్డారు. మూడేళ్ల క్రితం నాటి ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ ని ఈడీ అధికారులు ఈరోజు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం, రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కర్మ కాలిన రోజున ఆయన కూడా ఊచలు లెక్కపెడతారని, అప్పుడు, మోదీ కూడా ఆపలేరని అన్నారు.

ఈ కేసులో చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరుపుతున్నారని విమర్శించారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత మూడో కృష్ణుడు ఈడీ ఏం తేల్చుతోందని వ్యాఖ్యానించారు. ఈ కేసుతో సంబంధం లేని వేం నరేందర్ రెడ్డి కుమారులను విచారణ నిమిత్తం ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. వారికి రాజకీయ సంబంధాలు లేవని అన్నారు. తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై ఆయన విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు, కడియం శ్రీహరిలకు మంత్రి పదవులు ఇవ్వరని తాను నిన్ననే చెప్పానని, పనికి మాలినోళ్లను మంత్రులుగా పెట్టుకున్నారని రేవంత్ విమర్శించారు.

  • Loading...

More Telugu News