Gopal Ganj: మమ్మల్ని యుద్ధానికి పంపండి... మరణిస్తే సరే... లేకుంటే తిరిగి జైలుకే వస్తాం: మోదీకి ఖైదీల లేఖ
- మా రక్తం మరుగుతోంది
- మరణిస్తే అమరులుగా గుర్తించండి
- నరేంద్ర మోదీకి గోపాల్ గంజ్ ఖైదీల లేఖ
సైనికుల కాన్వాయ్ పై జరిగిన ఉగ్ర దాడితో దేశమంతా భగ్గుమంటున్న వేళ, బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ సబ్ డివిజనల్ జైలులోని ఖైదీలు, తమ రక్తం కూడా మరుగుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖను రాశారు. ఉగ్ర దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతుగా రూ. 50 వేలు అందించిన ఖైదీలు, ప్రధానికి లేఖను రాస్తూ, తమను యుద్ధానికి పంపాలని కోరారు.
యుద్ధం వస్తే తాము సరిహద్దుల్లో ముందు నిలిచి శత్రువులతో పోరాడేందుకు సిద్ధమని, ఈ యుద్ధంలో తాము మరణిస్తే, అమరులుగా గుర్తించాలని, గెలిచి ప్రాణాలతో బయటపడితే, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తిరిగి జైలుకు వస్తామని వారు పేర్కొన్నారు. జైల్లోని 250 మంది ఖైదీలు ఈ లేఖపై సంతకం చేశారని జైలు అధికారులు తెలిపారు.
కాగా, ఈ జైలులో 30 మంది మహిళా ఖైదీలు సహా 750 మంది ఉండగా, ఇందులో 102 మంది శిక్షలు అనుభవిస్తున్న వారు కాగా, మిగతా వారు అండర్ ట్రయల్ ఖైదీలు. అమరుల కుటుంబాలకు ఖైదీలు చేసిన సాయం తక్కువే అయినా, వారి సంకల్పం గొప్పదని ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ వ్యాఖ్యానించారు.