Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి గొంతు కోసి పరారయ్యాడు

  • జగద్గిరిగుట్ట పరిధిలో ఘటన
  • బాధితుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • తప్పిన ప్రాణాపాయం

ముక్కుమొహం తెలియని వారికి లిఫ్ట్ ఇస్తే ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చెబుతోంది. ఇది చదివిన తర్వాత అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వాలంటే భయపడతారు. అర్ధ రాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా నిల్చున్న వ్యక్తి లిఫ్ట్ అడిగితే జాలి చూపించి ఇచ్చిన పాపానికి బైకర్ గొంతు కోసి పరారయ్యాడో దుండగుడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో జరిగిందీ దారుణం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గాజులరామారం పరిధిలోని చంద్రగిరి నగర్‌కు చెందిన ఇమ్రాన్ (28) కుక్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి జీడిమెట్ల పరిధిలోని శ్రీరాంనగర్‌లో ఓ ఫంక్షన్ హాల్‌లో పని ముగించుకుని అర్ధరాత్రి దాటాక బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో రాత్రివేళ కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.

కొంతదూరం వెళ్లాక బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి వెంట తెచ్చుకున్న కత్తితో ఇమ్రాన్ గొంతు కోసి పరారయ్యాడు. రక్తంతో కుప్పకూలిన ఇమ్రాన్ కేకలు విన్న స్థానికులు, వాహనదారులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? లేక, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు.    

Hyderabad
Jagadgirigutta
Jeedimetla
Biker
Lift
Throat
  • Loading...

More Telugu News