India: అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ దుమ్ముదులిపిన భారత్
- తప్పుడు విచారణతో జాదవ్ కు మరణశిక్ష వేశారు
- పాక్ వద్ద ఎలాంటి ఆధారాల్లేవు
- ఐసీజేలో పదునైన వాదనలు వినిపించిన భారత్
చాలాకాలంగా పాకిస్థాన్ జైళ్లలో మగ్గిపోతున్న భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ కేసు ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విచారణ ప్రక్రియలో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఎంతో సమర్థవంతంగా వాదనలు వినిపించారు. పాకిస్థాన్ కుటిల బుద్ధిని అడుగడుగునా ఎత్తిచూపేందుకు ప్రయత్నించారు.
పాకిస్థాన్ కోర్టు తప్పుడు విచారణ జరిపి కుల్ భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విధించిందని, కనీసం అతడికి దౌత్యపరమైన సాయం అందించేందుకు కూడా అంగీకరించలేదని, తద్వారా వియన్నా ఒప్పందానికి తూట్లు పొడిచిందని సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానానికి నివేదించారు. కుల్ భూషణ్ జాదవ్ తప్పుచేశాడు అని చెప్పడానికి పాకిస్థాన్ వద్ద కనీస ఆధారాలు కూడా లేవని, వారి వాదనలో పసలేదని నొక్కిచెప్పారు. గూఢచర్యం చేశాడంటూ జాదవ్ పై తప్పుడు కేసు బనాయించారని, అతడిపై విధించిన మరణశిక్షను ఎత్తివేయాలంటూ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అర్థించారు.
జాదవ్ తమ దేశంలోకి గూఢచర్యం చేసేందుకు ప్రవేశించాడని పాక్ చెబుతుండగా, ఇరాన్ నుంచి జాదవ్ ను అపహరించారని భారత్ ఆరోపిస్తోంది. 2016 మార్చిలో బలూచిస్తాన్ ప్రావిన్స్ లో జాదవ్ గూఢచర్యానికి పాల్పడుతూ తమకు దొరికిపోయాడని పాక్ వర్గాలు ఇప్పటివరకు బుకాయిస్తూ వచ్చాయి. భారత నేవీ అధికారిగా పనిచేస్తున్న జాదవ్ ఓ బిజినెస్ ట్రిప్ మీద ఇరాన్ వెళ్లినప్పుడు పాక్ అతడిని కిడ్నాప్ చేసి అక్రమంగా జైల్లోకి తోసిందని భారత్ అనేక అంతర్జాతీయ వేదికలపై తూర్పారబడుతోంది.
ఇన్నాళ్లకు ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు చేరడంతో జాదవ్ విడుదలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. విచారణ సందర్భంగా న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ, భారత్ ను అంతర్జాతీయ వేదికలపై ఇరుకున పడేసేందుకు జాదవ్ కేసును పాకిస్థాన్ ఓ సాధనంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.