Pakistan: దాడి ఘటనకు ఘాజీ పర్యవేక్షకుడు మాత్రమే.. అసలు సూత్రధారి ఇతనే!
- పుల్వామా దాడి వెనుక ఐఎస్ఐ చీఫ్
- చివరి నిమిషంలో జైష్ కు దాడి బాధ్యతలు
- దార్ కు అన్ని విధాలా సాయం అందించిన ఐఎస్ఐ
పుల్వామా దాడికి సూత్రధారి అని భావించిన అబ్దుల్ రషీద్ ఘాజీని భారత భద్రతా బలగాలు మట్టుబెట్టడం ఓ విజయంగానే భావించాలి. అయితే ఈ దాడికి సూత్రధారి ఘాజీ కాదని, ఘాజీ కేవలం పర్యవేక్షకుడు మాత్రమేనని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ అసీమ్ మునీర్ ఈ దాడికి వ్యూహరచన చేశాడని, పూర్తిగా అతని సూచనల మేరకే దాడి జరిగిందని భారత నిఘా వర్గాలు తెలుసుకున్నాయి.
భారత్ లో భారీ ఉగ్రదాడి జరిపేందుకు అసీమ్ మునీర్ ఇతర ఉగ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జత కలిసింది. దాంతో చివరి నిమిషంలో పుల్వామా దాడి బాధ్యతలు జైషే సంస్థకు అప్పగించింది ఐఎస్ఐ. పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ దార్ కు పేలుడు పదార్థాలతో పాటు వాహనాన్ని కూడా ఐఎస్ఐ వర్గాలే సమకూర్చినట్టు సమాచారం.
అసీమ్ మునీర్ ఇటీవలే ఐఎస్ఐ చీఫ్ గా నియమితుడయ్యారు. ఆయనకు పాక్ సైనిక జనరల్ ఖమర్ బాజ్వా అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటారు. బాజ్వానే స్వయంగా అసీమ్ మునీర్ ను ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు. దాంతో తన గాడ్ ఫాదర్ ను మెప్పించేందుకే మునీర్ పుల్వామా దాడికి ప్రణాళిక రూపొందించాడని భారత నిఘా సంస్థలు ఓ నిర్ధారణకు వచ్చాయి. వాస్తవానికి ఫిబ్రవరి మొదటివారంలోనే దాడి చేయాలని భావించినా, భద్రత బలగాల దాడుల నేపథ్యంలో దాన్ని వాయిదా వేసి, గత గురువారం నాడు పకడ్బందీగా అమలు చేశారు. గతంలో పాక్ మిలిటరీ కమాండర్ గా పనిచేసిన అసీమ్ మునీర్ కు కాశ్మీర్ స్థితిగతులపై మంచి అవగాహన ఉంది.