Andhra Pradesh: రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మే సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేశ్

  • రైతులకు తగిన ప్రోత్సాహమిస్తే సిరులు పండిస్తారు
  • పెట్టుబడి రాయితీలను పెద్ద ఎత్తున పెంచాం
  • కౌలు రైతుల ఉన్నతి కోసం బాబు కృషి చేస్తున్నారు

రైతు బాగుంటే సమాజం బాగుంటుందని మన ముఖ్యమంత్రి నమ్ముతారని, అందుకే, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు భారీ ఎత్తున రూ. 24,000 కోట్ల రుణ ఉపశమనం కలిగించారని అన్నారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు. ఇప్పటివరకు మూడు విడతల్లో 10 శాతం వడ్డీతో కలిపి రూ.15,168.17 కోట్లు 58.33 లక్షల రైతుల ఖాతాల్లో జమ అయినట్టు చెప్పారు.

రైతులకు తగిన ప్రోత్సాహం అందించాలేగానీ సిరుల పంటలు పండించగలుగుతారని అన్నారు. అందుకే,  రైతులు మరిన్ని దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో భూసార పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, 2015-16 నుండి ఇప్పటి వరకు 68 లక్షల రైతులకు సంబంధించి 129.06 లక్షల భూసార పరీక్షా ఫలితాల పత్రాలను రైతులకు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆరుగాలం కష్టించి సేద్యం చేసే రైతన్న పెట్టుబడి భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీలను పెద్ద ఎత్తున పెంచి వారికి అందజేసిందని, అలాగే, ప్రకృతి వైపరీత్యాల వలన 36.34 లక్షల హెక్టార్ల పంట నష్టపోయిన 40.82 లక్షల మంది రైతులకు రూ.3,728.16 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. సాగుకు అవసరమైన పెట్టుబడుల విషయంలో కౌలు రైతుల కష్టానికి చేయూతనిస్తూ వారి ఉన్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు  కృషి చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు.  2014 నుంచి నేటివరకు రాష్ట్రంలోని 26.72 లక్షల మంది కౌలు రైతులకు రూ. 9654 కోట్ల వ్యవసాయ రుణాలను అందించారని అన్నారు.

కల్తీవిత్తనాల వల్ల రైతులు నష్టపడకూడదని భావించిన ప్రభుత్వం, 47.34 లక్షల క్వింటాళ్ల మేలురకం విత్తనాలను రైతులకు పంపిణీ చేసిందని, ఈ పంపిణీని డి-క్రిషి ఆప్ ద్వారా అత్యంత పారదర్శకతతో నిర్వహించినందుకు సీఎస్ఐ నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డును ఏపీ గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. రైతులకు ఎరువుల భారం తగ్గించడానికై రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం రాయితీపై సూక్ష్మ పోషక ఎరువులను పంపిణీ చేస్తోందని, 2.96 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడం ద్వారా 36.62 లక్షల హెక్టార్లలో సూక్ష్మ పోషక లోపాలు సవరించి 8-17 శాతం పంట దిగుబడులు పెంచడం జరిగిందని చెప్పారు.


  • Loading...

More Telugu News