Supreme Court: ఎప్పుడూ నవ్వుతూ ఉండటానికి నేను రాజకీయ నాయకుడిని కాదు.. కొందరు చెత్త వాగుడు వాగితే నేనేం చేయాలి?: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్
- జడ్జిలపై బుదద చల్లడం ఒక డేంజరస్ ట్రెండ్
- జడ్జిలపై విమర్శలు చేయడం సరికాదు
- నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తా
సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో జడ్జిలకు కొన్ని ఉద్దేశ్యాలను అంటగడుతుండటంలాంటివి ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయని... ఇది సరైంది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోని ఉన్నత పదవులను అందుకోవాలన్న యువత ఆకాంక్షలకు ఇది అడ్డుపడుతుందని చెప్పారు.
'జడ్జిమెంట్లను విమర్శించండి. తీర్పుల్లో తప్పులను ఎత్తి చూపండి. కానీ, జడ్జిమెంట్లను ఇచ్చిన జడ్జిలకు కొన్ని ఉద్దేశ్యాలను అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం మాత్రం సరికాదు. జడ్జిలపై బురద చల్లడం వంటివి ఒక డేంజరస్ ట్రెండ్. జడ్జిలపై బురద చల్లే ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే... ఎంతో టాలెంట్ ఉన్న యువత జడ్జి వృత్తిని చేపట్టేందుకు ఇష్టపడరు. జడ్జిషిప్ వైపు యువతను ఆకర్షించడం కఠినతరమవుతుంది.' అని గొగోయ్ అన్నారు. ఇతర వృత్తుల ద్వారా కావాల్సినంత సంపాదించుకుంటున్నాం... జడ్జిగా బాధ్యతలను చేపట్టి బురద ఎందుకు చల్లించుకోవాలని యువత భావించే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలతో తమ కుటుంబాలు ప్రభావితమవుతాయని యువత భావిస్తారని తెలిపారు.
కోర్టు హాల్ లో తాను చాలా తక్కువ నిగ్రహంతో ఉంటాననే వ్యాఖ్యలపై గొగోయ్ స్పందిస్తూ... ఎవరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ తృప్తి పరచడానికి తాను రాజకీయ నాయకుడినో, దౌత్యవేత్తనో కాదని అన్నారు. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తానని, ఇది కొందరికి తప్పుగా కనిపిస్తోందని చెప్పారు. దీని గురించి కొందరు చెత్త వాగుడు వాగితే తాను ఏం చేయగలనని ప్రశ్నించారు.