Ramcharan: మెగా కోడలు ఉపాసన సరికొత్త సేవ
- టెన్త్ విద్యార్థులకు ఉపాసన అల్పాహారం
- ఉదయం, సాయంత్రం అందిస్తానని ప్రకటన
- మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్ష
కొణిదెల వారి కోడలు, హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన సామాజిక సేవల పట్ల ఎంతో మక్కువ చూపిస్తుందని అందరికీ తెలుసు. అపోలో ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసే అపోలో ఫౌండేషన్ కు ఆమె చీఫ్ కూడా. తన సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలకు చేయూతగా నిలుస్తున్న ఉపాసన మరోసారి వార్తల్లోకెక్కారు.
తమ కుటుంబ స్వస్థలం అయిన దోమకొండ మండల కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ లో తాజాగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు అల్పాహారం అందించారు. గడికోట ట్రస్ట్ నుంచి హైస్కూల్ కు వెళుతున్న 89 మంది విద్యార్థులకు ఉదయం, సాయంకాలం వేళల్లో మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తామని ఉపాసన ఈ సందర్భంగా ప్రకటించారు. మార్చి 10వ తేదీ వరకు అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని, పరీక్షల సమయంలో పోషకాహారం అవసరం కాబట్టే తాము అల్పాహారం ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటే తాము చదువుకున్న స్కూలుతోపాటు సొంత ఊరి పేరు నిలబెట్టినవాళ్లవుతారని ఉపాసన పేర్కొంది. తన తండ్రితో కలిసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశానని, అందుకు జిల్లా కలెక్టర్, గ్రామ సర్పంచ్ తమ సహకారం అందించారని వెల్లడించింది.
ఒక్క మధ్యాహ్నం పూటే వాళ్లు పూర్తిస్థాయి భోజనం తీసుకుంటున్న విషయం గుర్తించామని, అయితే బాగా చదవాలంటే సరైన పోషకాహారం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఆహారం తయారుచేయడానికి అవసరమైనవాటిని ఉపాసన స్థానిక రైతుల నుంచే కొనుగోలు చేయడం విశేషం అని చెప్పాలి. ఆ విధంగా రైతులకు కూడా ఉపయోగిపడినట్టు ఉంటుందని తెలిపారు.