Andhra Pradesh: జగన్ వాళ్ల తాత బీసీలను బతకనివ్వలేదు.. తండ్రి వైఎస్ అయితే బీసీలను జైళ్లలో పెట్టించారు!: మంత్రి యనమల
- జగన్ ఏనాడూ బీసీలను పట్టించుకోలేదు
- టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ, వైసీీపీ, టీఆర్ఎస్ కుట్ర
- పేద కుటుంబాలను ముఠా కక్షలకు బలిచేశారు
వైఎస్ అధికారంలో ఉండగా జగన్ ఏనాడూ బీసీల గురించి మాట్లాడలేదని టీడీపీ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే బీసీలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాతే అసలు బీసీలకు గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. బీసీలను టీడీపీకి దూరం చేసేందుకు వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయనీ, వాటిని ప్రజలే తిప్పికొడతారని అన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడారు.
వైసీపీ అధినేత జగన్ బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని యనమల మండిపడ్డారు. బీసీలను జగన్ తాత రాజారెడ్డి ఫ్యామిలీనే ఫ్యాక్షన్ రక్కసికి బలి చేసిందని ఆరోపించారు. ఈ గొడవల్లో బీసీల తోటలు, ఆస్తులు, పంటలు నాశనం అయ్యాయని దుయ్యబట్టారు. జగన్ తాత బీసీలను బతకనివ్వలేదనీ, వైఎస్ అయితే బీసీలను జైళ్లలో పెట్టించారని విమర్శించారు. పేద కుటుంబాలను ముఠా కక్షలకు బలిచేసి.. ఇప్పడు అధికార కాంక్షతో జగన్ కొంగజపం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. చట్ట సభలకు హాజరుకానివారికి ఓట్లడిగే హక్కే లేదని యనమల స్పష్టం చేశారు.