Pakistan: ఎన్నికలైనా, మరేదైనా అన్నీ పక్కనబెట్టి ముందు పాక్ పనిబట్టండి: శివసేన డిమాండ్
- నిఘా వైఫల్యం కారణంగానే ఘటన
- పాక్ లో ప్రవేశించేందుకు ఇదే సరైన తరుణం
- దాయాదిపై నిప్పులు చెరిగిన శివసేన చీఫ్
ఓవైపు ఎన్డీయే సర్కారు పాకిస్థాన్ కు ఘాటుగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో శివసేన పార్టీ పుల్వామా ఉగ్రదాడి ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించింది. పాకిస్థాన్ లోకి నేరుగా ప్రవేశించి ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇదే సరైన తరుణం అని పేర్కొంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ముంబయిలో శుక్రవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఉగ్రదాడి మాత్రమే కాదు, మన నిఘా వ్యవస్థల వైఫల్యం అని కూడా భావించాలని అన్నారు.
"ఇంతటి భారీ దాడిపై కనీస ముందస్తు సమాచారం కూడా సేకరించలేకపోయారంటే దారుణ నిఘా వైఫల్యం తప్ప మరొకటి కాదు. ఇంటలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? ఒకవేళ నిఘా వ్యవస్థల వైఫల్యమే ఉగ్రదాడికి కారణమైతే ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదు. 2016 సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత పాకిస్థాన్ లోకి నేరుగా ప్రవేశించి దాడులు చేయడానికి ఇదే మంచి అదను. మా దేశం మీకు లొంగిపోదని, మీకు తగిన గుణపాఠం చెబుతామని దేశం మొత్తం ముక్తకంఠంతో నినదించాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికలైనా, మరేదైనా గానీ, అన్నింటినీ పక్కనబెట్టి పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయడంపైనే దృష్టి పెట్టాలి" అని పిలుపునిచ్చారు.