Andhra Pradesh: ఏపీ రైతులకు శుభవార్త.. ఐదు ఎకరాలలోపు రైతులకు రూ.9 వేల సాయం ప్రకటించిన చంద్రబాబు!
- కేంద్రం సాయం కాకుండా రైతులకు అదనంగా ఇస్తాం
- కేంద్ర సాయంతో కలిపి మొత్తం రూ.15 వేలు ఇస్తాం
- సీఎం చంద్రబాబు ప్రకటన
ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ‘అన్నదాతా సుఖీభవ’ కింద అందించే సాయాన్ని పెంచారు. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ. 9వేల చొప్పున ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకుంటే ఇది రూ. 15 వేలు కానుంది. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.6,560 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 76 లక్షల మంది రైతులు ఉండగా అందులో 65.74 లక్షల మంది ఐదెకరాల లోపు ఉన్నవారే. వీరందరికీ ఏడాదికి రూ. 9 వేలను రెండు విడతలుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు ఇందుకు అదనం. అంటే ఒక్కో రైతు ఖాతాలో ఏడాదికి రూ. 15 వేలు జమ కానున్నాయి. అయితే, ఐదెకరాలకు పైనున్న రైతులకు కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో రాష్ట్రప్రభుత్వం వారికి రూ. 10 వేల చొప్పున అందించాలని నిర్ణయించింది. అంటే, ఐదెకరాలు పైన ఎంత ఉన్నా ప్రతీ రైతుకు రూ.10 వేలు అందుతుందన్నమాట. రాష్ట్రంలో ఐదెకరాల పైన భూమి ఉన్న రైతులు రూ. 10.50 లక్షల మంది ఉన్నట్టు అంచనా. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు మొదటి విడతగా ఒక్కో రైతు కుటుంబానికి రూ. 4 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమచేయనుంది.
మరోవైపు, రాష్ట్రంలోని 15.50 లక్షల కౌలు రైతులకు కూడా సాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కౌలు రైతులు నికరంగా గరిష్టంగా 10 లక్షల మంది ఉంటారని భావిస్తున్న ప్రభుత్వం ఖరీఫ్ మొదలు కాగానే వారిని గుర్తించే కార్యక్రమాన్ని మొదలు పెట్టనుంది. అనంతరం కౌలు రైతు కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున సాయం అందించనున్నారు