Nellore District: మాగుంట మౌనం... బాబుతో భేటీ అనంతరం మీడియాకు నమస్కారంతో సరి!

  • మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఎమ్మెల్సీ
  • అసలేం జరిగిందన్న ఆసక్తి
  • పార్టీ వీడుతారన్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం

ఓ చిరునవ్వు...అనంతరం ఓ నమస్కారం...అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిష్క్రమించారు టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. సుదీర్ఘకాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్న ఆయన పార్టీ మారుతున్నారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయన నెల్లూరులో తన అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశం కూడా అయ్యారన్న వార్తలు వచ్చాయి.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మాగుంట కూడా వారినే అనుసరించనున్నారని గుసగుసలు మొదలయ్యాయి. దీంతో టీడీపీ అధిష్ఠానం అప్రమత్తమయింది.

చంద్రబాబు పిలుపుతో ఈ రోజు అమరావతిలో ఆయనతో భేటీ అయిన శ్రీనివాసులురెడ్డి చాలాసేపు పలు అంశాలపై మాట్లాడారు. బయటకు వచ్చిన అనంతరం మీడియాకు ఏదో ఒకటి చెబుతారని ఆశించినా నిరాశే మిగిలింది. చిరునవ్వుతో ఓ నమస్కారం పెట్టేసి ఆయన వెళ్లిపోయారు. దీంతో రాజకీయ విశ్లేషకులు పలురకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన నిర్ణయం ఏమిటన్నదే ఈ లెక్కల్లోని పరమార్థం.

Nellore District
magunta srinivasulareddy
Chandrababu
  • Loading...

More Telugu News