Enforcement Directorate: రాబర్ట్ వాద్రాకు షాక్.. బికనేర్ భూ కుంభకోణంలో రూ.4.6 కోట్ల ఆస్తులు అటాచ్
- రాబర్ట్ వాద్రాను పలు దఫాలుగా విచారించిన ఈడీ
- 2015లోనే వాద్రాపై కేసు నమోదు
- తాజాగా ఆస్తులను అటాచ్ చేసినట్టు ప్రకటన
ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. బికనేర్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా కంపెనీకి చెందిన రూ.4.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో వాద్రా కంపెనీకి చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. బికనేర్ భూ కుంభకోణం కేసులో ఈడీ 2015లో క్రిమినల్ కేసు నమోదు చేసింది. భూకేటాయింపుల్లో ఫోర్జరీ జరిగిందని ఆరోపిస్తూ బికనేర్ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసులో మంగళవారం రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌లను జైపూర్‌లో ఈడీ విచారించింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వాద్రా భార్య ప్రియాంక కూడా ఉన్నారు. గతవారం రాబర్ట్ వాద్రాను ఈడీ ఢిల్లీలో మూడు రోజులపాటు విచారించింది. తాజాగా ఆస్తులను అటాచ్ చేసినట్టు ప్రకటించింది.