Cricket: టీమిండియాలో కొత్త ముఖం.. మయాంక్ మార్కండే!
- ఆసీస్ తో సిరీస్ కు పంజాబ్ కుర్రాడు
- ప్రతిభకు పట్టం కట్టిన సెలక్టర్లు
- టి20 సిరీస్ కు మాత్రమే ఎంపిక
భారత్ లో ప్రస్తుతం ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు లోటు లేదు. దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు పెరగడంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక సెలక్టర్లే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తుదిజట్టులో ఉన్న అందరూ బాగానే ఆడుతుండడంతో కొత్తవాళ్లను తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్ కు కూడా ఎంతో జాగ్రత్తగా టీమ్ ను సెలక్ట్ చేసింది ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సీనియర్ సెలెక్షన్ ప్యానెల్. ఆశ్చర్యకరంగా 21 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే మొదటిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆసీస్ తో జరిగే టి20 మ్యాచ్ లకు ఎంపిక చేసిన జట్టులో మయాంక్ కు స్థానం కల్పించారు బీసీసీఐ సెలక్టర్లు.
పంజాబ్ కు చెందిన మయాంక్ మార్కండే జూనియర్ స్థాయి నుంచే బౌలింగ్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టిన ఏడాదే హైదరాబాద్ తో మ్యాచ్ లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్ తో మ్యాచ్ లో 31 పరుగులకు 5 వికెట్లు తీసి సెలక్టర్లను మెప్పించాడు. మరికొన్ని నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో కొత్తవాళ్లను తీసుకోకపోవచ్చని క్రికెట్ మేధావులు భావించారు. కానీ మయాంక్ మార్కండే వంటి టాలెంట్ ఉన్న కుర్రాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ తన నిర్ణయం ద్వారా తెలియజేసింది. తన ఎంపికపై మార్కండే మాట్లాడుతూ, తన కల నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇంత త్వరగా టీమిండియాలో స్థానం లభిస్తుందని అనుకోలేదని పొంగిపోయాడు.