Andhra Pradesh: జవాన్లపై దాడి పిరికిపందల చర్యే.. ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్!
- అమరులకు సంతాపం తెలిపిన జగన్
- జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై నిన్న జరిగిన ఉగ్రదాడిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఖండించారు. జైషే మొహమ్మద్ ఆత్మాహుతి దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దాడిలో అమరులైన జవాన్లకు సంఘీభావం తెలిపిన జగన్, జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపొరలో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓ కారులో 350 కేజీల శక్తిమంతమైన ఐఈడీ పేలుడు పదార్థాలను పేర్చుకున్న ఉగ్రవాది జవాన్ల బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు ఎన్ఐఏ, ఎన్ఎస్ జీ నిపుణులు సమగ్ర విచారణ జరపనున్నారు.