Madhya Pradesh: తండ్రి శవాన్ని నెలరోజులు ఇంట్లో ఉంచుకుని.. ఆయుర్వేద వైద్యం చేయించిన ఐపీఎస్ అధికారి

  • దిగ్భ్రాంతి చెందిన ఇతర అధికారులు
  • ఎవరిపై కేసు పెట్టాలో తెలియక అయోమయంలో పోలీసులు
  • మరో సీనియర్ అధికారిపైనే భారం

ఐపీఎస్ అధికారి అంటే ఎంతో హేతుబద్ధతతో, ఆదర్శనీయంగా వ్యవహరించాల్సిన ఉద్యోగి. భారత్ లో గొప్ప సర్వీసుగా భావించే ఐపీఎస్ క్యాడర్ లో ఉండి కూడా ఈ అధికారి తన వింత ప్రవర్తనతో దిగ్భ్రాంతి కలిగించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన రాజేంద్ర కుమార్ మిశ్రా చనిపోయిన తన తండ్రి శవాన్ని నెల రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని ఆయుర్వేద వైద్యం చేయించడం విస్తుగొలుపుతోంది. పైగా, ఆయుర్వేద చికిత్సకు తన తండ్రి స్పందిస్తున్నాడంటూ స్వయంగా చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. రాజేంద్ర కుమార్ మిశ్రా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఏడీజీ సెలక్షన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆయన తండ్రి కేఎం మిశ్రా (84) గత నెలలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భోపాల్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. దాంతో తన తండ్రి భౌతికకాయాన్ని నేరుగా ఇంటికి తీసుకువచ్చి ఆయుర్వేద చికిత్స చేయించడం మొదలుపెట్టారు రాజేంద్ర కుమార్ మిశ్రా. కానీ శవం కుళ్లి కంపు కొడుతుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు ఐపీఎస్ అధికారి వద్ద పనిచేసే సిబ్బంది కూడా ఈ వాసన తట్టుకోలేక అస్వస్థత పాలయ్యారట. ఇదేంటని అడిగితే... తన తండ్రి ఆయుర్వేద చికిత్సకు స్పందిస్తున్నారంటూ రాజేంద్ర కుమార్ మిశ్రా సీరియస్ గా బదులిచ్చారు. దాంతో పోలీసులు సైతం విచిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.

అసలీ వ్యవహారంలో ఫిర్యాదు లేకుండా ఎలా జోక్యం చేసుకోవాలో తెలియక పోలీసు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓవైపు కేఎం మిశ్రాకు చికిత్స అందించిన ఆసుపత్రి వర్గాలు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినాగానీ ఆ ఐపీఎస్ అధికారి మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ వ్యవహారం ఎంతో సున్నితమైనది కావడంతో పరిష్కరించే బాధ్యతను ఓ సీనియర్ ఆఫీసర్ కు అప్పగించి చేతులు దులుపుకున్నారు మధ్యప్రదేశ్ ఉన్నత అధికారులు.

  • Loading...

More Telugu News