chirala: ఇచ్చిన గౌరవాన్ని ఆమంచి కృష్ణమోహన్ నిలుపుకోలేకపోయారు : చంద్రబాబు
- ఆయన పార్టీ వీడడం వల్ల వచ్చిన నష్టం లేదు
- ఎంత బిజీగా ఉన్నా గంటసేపు మాట్లాడి నచ్చజెప్పా
- నియోజకవర్గం అభివృద్ధికి రూ.700 కోట్లిచ్చిన విషయం గుర్తుచేశా
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు తాను ఎంతో గౌరవాన్ని ఇచ్చినా అతను నిలబెట్టుకోలేకపోయాడని, అతను పార్టీ వీడడం వల్ల టీడీపీకి వచ్చిన నష్టం ఏమీలేదని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాసిన కృష్ణమోహన్ అనంతరం వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కలిశారు. భేటీ తర్వాత బయటకు వచ్చాక తాను త్వరలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సీఎం స్పందించారు. ఆమంచి అసంతృప్తితో ఉన్నారని తెలిసి తీరికలేనంత బిజీగా ఉన్నప్పటికీ గంట సమయం అతనికి కేటాయించి అన్ని విషయాలు మాట్లాడానని, అయినా అతను మనసు మార్చుకోలేదని గుర్తు చేశారు. చీరాల నియోజకవర్గం అభివృద్ధికి 700 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశానన్నారు. అయినా ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పడం దురదృష్టమన్నారు. ఆమంచి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం లేదని, ఎంతోమంది సమర్థులైన సీనియర్ నాయకులు ఉన్నారని స్పష్టం చేశారు.