vk singh: యుద్ధ విమానాల విడిభాగాలు రన్ వే పై పడిపోయాయి.. ఇదేనా హెచ్ఏఎల్ సమర్థత?: కేంద్ర మంత్రి వీకే సింగ్
- ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయి ఇద్దరు పైలట్లు చనిపోయారు
- ఆ విమానాన్ని హెచ్ఏఎల్ అప్ గ్రేడ్ చేసింది
- రాఫెల్ లాంటి విమానాలను హెచ్ఏఎల్ తయారు చేయలేదు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సమర్థతపై విదేశాంగ శాఖ సహాయమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రాఫెల్ డీల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో ఆయన హెచ్ఏఎల్ పై విమర్శలు గుప్పించారు. పూణేలో ఆయన మాట్లాడుతూ, రాఫెల్ డీల్ ను సమర్థించారు. 36 రాఫెల్ విమానాలను సమకూర్చుకోవడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చాలా అవసరమని చెప్పారు.
'హెచ్ఏఎల్ పరిస్థితి చూడండి. మన ఇద్దరు పైలట్లు చనిపోయారు. మూడున్నరేళ్ల ఆలస్యంగా హెచ్ఏఎల్ నడుస్తోంది. ఈ విషయం చెప్పడానికి చింతిస్తున్నా. యుద్ధ విమానాల విడి భాగాలు ఊడి రన్ వేపై పడిపోతున్నాయి. సమర్థత అంటే ఇదేనా? రాఫెల్ స్థాయిలో విమానాలను హెచ్ఏఎల్ తయారు చేయలేదు' అంటూ వీకే సింగ్ వ్యాఖ్యానించారు.
ఈనెల 1న బెంగళూరులో మిరేజ్ 2000 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానాన్ని హెచ్ఏఎల్ అప్ గ్రేడ్ చేసింది. ఈ ఘటనను ఉటంకిస్తూ వీకే సింగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
రాఫెల్ డీల్ వ్యవహారంలో అనిల్ అంబానీకి ప్రధాని మోదీ సహకరించారనే ఆరోపణలపై వీకే సింగ్ స్పందిస్తూ... ఇది ఫ్రెంచ్ సంస్థకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. తమ కార్యకలాపాలను విస్తరించడం కోసం ఇండియాలో భాగస్వామిని ఎంచుకున్నారని తెలిపారు. హెచ్ఏఎల్ సమర్థత వారికి నచ్చనప్పుడు, ఇతర సంస్థను ఎంచుకునే హక్కు వారికి ఉంటుందని చెప్పారు. అనిల్ అంబానీ సంస్థను వారు ఎంచుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం లేదని అన్నారు.
భారత వాయుసేనకు 36 రాఫెల్ విమానాలు అత్యవసరమని వీకే సింగ్ చెప్పారు. మనమంతా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పోతే... దేశ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని అన్నారు.