Sudhakar: పార్టీలో పెద్ద మొత్తంలో డబ్బు తారుమారవుతోంది: మీడియాతో మావో నేత సుధాకర్
- పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీలో చేరా
- ఆర్థిక, నైతిక విలువలు లోపించాయి
- 35 ఏళ్లపాటు ఉద్యమంలో పనిచేశా
- పార్టీలో ఉండలేనని భావించి లొంగిపోయా
మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు సత్వాజీ అలియాస్ సుధాకర్, ఆయన భార్య అరుణ అలియాస్ నీలిమ నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా సుధాకర్ మీడియా ఎదుట కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు దళంలో చేరానని, కానీ పార్టీలో అనుకున్న పరిస్థితులు లేవని ఆయన చెప్పారు. పార్టీలో పెద్ద మొత్తంలో డబ్బు తారుమారవుతోందని, ఆర్థిక విలువలు, నైతిక విలువలు లోపించాయని అన్నారు. తన తమ్ముడి దగ్గర లభించిన డబ్బు పార్టీ అవసరాల కోసం పంపించినదన్నారు.
తాను కూడా వచ్చేముందు రూ.25 లక్షలకు సంబంధించిన లెక్కలు కమిటీకి చెప్పే వచ్చానని సుధాకర్ తెలిపారు. 35 ఏళ్ల పాటు ఉద్యమంలో పని చేసిన తాను సమస్యలను కమిటీల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. సమస్యలపై మాట్లాడిన వారిని ఒంటరిని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరితో చర్చించిన మీదటే తానిక పార్టీలో ఉండలేనని భావించి లొంగిపోయినట్టు సుధాకర్ వెల్లడించారు.
ప్రజల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశానన్నారు. తాను పార్టీ సిద్ధాంతం కోసం బీహార్, జార్ఖండ్ వెళ్లానన్నారు. కానీ అక్కడి పరిస్థితులు తాను అనుకున్న దానికి భిన్నంగా ఉన్నాయన్నారు. 2013 నుంచి అక్కడి పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రయత్నించానని, కానీ తన వల్ల కాలేదని అన్నారు. ఈఆర్బీ అనేది పార్టీకి ముఖ్యమైన ప్రాంతమని అక్కడనే పరిస్థితి సరిగా లేదని సుధాకర్ తెలిపారు.