Chaina: పోస్టల్ శాఖ వారి లీల .. చైనాకు వెళ్లిన పంజాబ్ పార్శిల్!
- పంజాబ్‌లోని చైనాకు చేరాల్సిన పార్శిల్ చైనాకు
- స్పెల్లింగ్‌ను అర్థం చేసుకోవడంలో పోస్టల్ సిబ్బంది పొరపాటు
- వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి
స్పెల్లింగ్‌ను అర్ధం చేసుకోవడంలో చేసిన పొరపాటు వల్ల ఓ పార్శిల్ ఏకంగా దేశ సరిహద్దు దాటేసింది. రక్తపోటుకు అవసరమైన మందులు ఉన్న ఆ పార్శిల్ పంజాబ్‌లో డెలివరీ కావాల్సి ఉండగా దానిని ఏకంగా చైనాకు పంపించేశారు పోస్టల్ అధికారులు.
చండీగఢ్‌లోని న్యూ దర్శన్‌బాగ్‌కు చెందిన బల్విందర్ కౌర్ అనే మహిళ రూ. 5 వేల విలువైన బ్లడ్‌ప్లెజర్ మందులున్న ఓ పార్శిల్‌ను గతేడాది జనవరి 18న ఫరీద్‌కోట్‌లోని జైటో తహసీల్ పరిధిలో ఉన్న చైనా (Chaina)కు రిజిస్టర్ పోస్టులో పంపించింది. అయితే, అవి ఎంతకూ తాను పంపించిన చిరునామాకు చేరకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కన్‌సైన్‌మెంట్ నంబరు ద్వారా ఆన్‌లైన్‌లో వెతికి చూసి ఆశ్చర్యానికి గురైంది. తాను పంపిన పార్శిల్ చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్నట్టు తెలిసి నోరెళ్లబెట్టింది.
కౌర్ పంపించిన పార్శిల్ చండీగఢ్ నుంచి తొలుత ఢిల్లీకి, ఆ తర్వాత చైనాకు చేరుకుంది. జనవరి 19 నుంచి 27వ తేదీ వరకు ప్రయాణించిన పార్శిల్ అదే నెల 31న తిరిగి కౌర్ చెంతకు చేరింది. పార్శిల్‌పై కౌర్ రాసిన చిరునామాను అర్థం చేసుకోవడంలో తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగినట్టు పోస్టల్ అధికారులు తెలిపారు.
కౌర్ ఆ పార్శిల్‌పై డెలివరీ చైనా (delivery Chaina) అని రాశారని, దానిని చైనా (China) భావించడం వల్ల తప్పు జరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు. కాగా, చేసిన తప్పిదానికి తన డబ్బులు వెనక్కి ఇప్పించాల్సిందిగా బల్విందర్ కౌర్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, జరిగిన తప్పిదానికి చింతించిన పోస్టల్ అధికారులు డబ్బులు తిరిగి ఇవ్వలేం కానీ, అంతే మొత్తంలో ఉన్న పార్శిల్‌ను ఒకసారికి ఉచితంగా డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, వినియోగదారునికి తీవ్ర మానసిక ఆవేదన, శారీరక శ్రమ కలిగించినందుకు రూ. 5 వేలు చెల్లించాల్సిందిగా ఫోరం ఆదేశించింది.