Amit Bhandari: ఆ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించే అవకాశం: డీడీసీఏ చీఫ్ రజత్ శర్మ
- అండర్-23 జట్టుకు ఎంపిక చేయలేదన్న కక్ష
- సెలక్టర్ అమిత్ భండారీపై గూండాలతో దాడి
- అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీ సెలక్టర్, టీమిండియా మాజీ పేసర్ అమిత్ భండారీపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన వర్ధమాన క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాల నిషేధం విధించే అవకాశం వుందని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. అండర్-23 జట్టు కోసం సెలక్షన్లు జరుగుతున్న వేళ తనను ఎంపిక చేయలేదన్న కక్షతో 15 మంది గూండాలతో కలిసి అమిత్ భండారీపై అనూజ్ దాడి చేశాడు. హాకీ స్టిక్‌లు, క్రికెట్ బ్యాట్‌లతో విచక్షణ రహితంగా భండారీని చితక్కొట్టారు. వారి దాడిలో అమిత్ ముఖం, ముక్కు, తలభాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు అనూజ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై డీడీసీఏ చీఫ్ రజత్ శర్మ మాట్లాడుతూ.. నేడు బోర్డు సభ్యుల సమావేశం అనంతరం అనూజ్‌పై ఎటువంటి చర్య తీసుకోవాలనేది నిర్ణయిస్తామన్నారు. అతడిపై జీవితకాల నిషేధం విధించే అవకాశమే ఎక్కువగా ఉందన్నారు. అతడు చేసిన దానికి తీవ్రమైన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.