Valentines Day: ప్రేమజంటలు రోడ్లపై కనిపిస్తే వదిలేది లేదు!: హైదరాబాద్ 'భజరంగ్ దళ్' హెచ్చరికలు
- వాలెంటైన్స్ డే జరిపితే దాడులు తప్పవు
- కూడళ్లలో వాలెంటైన్స్ దిష్టి బొమ్మల దగ్ధంతో నిరసన
- భజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ సుభాష్ చందర్
భారత సంస్కృతిలో భాగంకాని ప్రేమికుల రోజును జరుపుకుంటే దాడులు తప్పవని భజరంగ్ దళ్ హెచ్చరించింది. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ పేరు చెబుతూ, ప్రేమ జంటలు బయట కనిపిస్తే, వారిని పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని భజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ సుభాష్ చందర్ తెలిపారు.
విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రేమికుల రోజు పేరిట పబ్ లు, మాల్స్, హోటల్స్ లో స్పెషల్ ఈవెంట్లు జరిపితే దాడులు తప్పవని హెచ్చరించారు. రహదారులు, పార్కులపై ప్రేమ జంటలు కనిపిస్తే వదిలిపెట్టబోమని అన్నారు. గురువారం నాడు అన్ని కూడళ్లలో వాలెంటైన్స్ దిష్టి బొమ్మలను దహనం చేయడం ద్వారా తమ నిరసనలను తెలియజెప్పనున్నామని, నల్ల జెండాలను ప్రదర్శిస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో భజరంగ్ దళ్ నేతలు ముఖేశ్, శివరాములు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.