high courts: హైకోర్టులో ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న 30 వేల కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ
- ఆదేశాలు జారీ చేసిన తెంగాణ హైకోర్టు
- కేసుల్లో అప్పీళ్లు, రిట్ పిటిషన్లు తదితరాలు
- రెండు రాష్ట్రాల ఉమ్మడి కేసుల విచారణ హైదరాబాద్‌లోనే
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పడడంతో ఏపీ ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసుల్ని విజయవాడ కోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. కొద్ది రోజుల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. దీంతో విజయవాడలో తాత్కాలిక భవనంలో కోర్టు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
కోర్టు విభజన అనంతరం కేసుల బదిలీ అధికారాన్ని సుప్రీం కోర్టు తెలంగాణ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కట్టబెట్టడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వంపై ఉన్న రిట్ పిటిషన్లు, అప్పీళ్లు దాదాపు 30 వేలు ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. ఇకపై ఈ కేసు విచారణ విజయవాడలోనే జరగనుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి కేసుల విచారణ మాత్రం తెలంగాణ హైకోర్టులోనే విచారణ జరగనుంది. ఈ మేరకు న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.