Britian: తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు శస్త్రచికిత్స.. వెన్నెముక లోపాన్ని సరిచేసిన వైద్యులు!
- ఆరు నెలల పిండంలో లోపాన్ని గుర్తించిన వైద్యులు
- నాలుగు గంటలపాటు శ్రమించి రంధ్రాన్ని పూడ్చిన వైనం
- బ్రిటన్ వైద్యుల అరుదైన ఆపరేషన్
వైద్య శాస్త్ర అభివృద్ధికి ఇదో మచ్చుతునక. తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. బ్రిటన్‌లో జరిగిందీ ఘటన. బెథాన్ సింప్సన్ అనే మహిళ గర్భంలో పెరుగుతున్న శిశువులో వెన్నెముకకు సంబంధించిన సమస్యను గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి పిండంలోని లోపాన్ని విజయవంతంగా సరిచేశారు.
శిశువులో ‘స్పైనా బిఫిడా’ సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి వెన్నెముకలో ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చివేశారు. ఇందుకోసం నాలుగు గంటలు శ్రమించినట్టు చెప్పారు. ఆరు నెలల గర్భిణి అయిన బెథాన్ ఏప్రిల్‌లో బిడ్డకు జన్మనివ్వనుంది.