chiranjeevi: నన్ను అమితంగా అభిమానించే విజయబాపినీడు గారిని కోల్పోవడం ఎంతో బాధాకరంగా వుంది: చిరంజీవి
- నాతో వరుస సినిమాలు చేశారు
- ఏనుగుని కానుకగా ఇచ్చారు
- నాలుగు సిటీల్లో ఒకేరోజున 100 డేస్ ఫంక్షన్ చేశారు
చిరంజీవి కెరియర్ కి ఎంతో హెల్ప్ అయిన చిత్రాల వరసలో .. ఆయన క్రేజ్ ను మరింతగా పెంచిన చిత్రాల జాబితాలో, విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కూడా కనిపిస్తాయి. అలాంటి విజయబాపినీడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ .. 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా నుంచి 6 సినిమాల వరకూ విజయబాపినీడు గారు నాతో చేస్తూ వచ్చారు.
ఇతర హీరోలతో కూడా చేయండి అని నేను అంటే 'మీతో సినిమాలు చేయడం ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది .. మరొకరితో ఇమడలేకపోతున్నాను' అనేవారాయన. అలా ఆయన నాతో వరుస సినిమాలు చేస్తూ, నాపై తనకున్న అభిమానాన్ని .. ప్రేమను చూపారు. నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు 'ఎక్కడ ఉండాలి?' అని అనుకుంటూ ఉండగా, తన గెస్టు హౌస్ లో ఉండమని చెప్పి ఏర్పాటు చేశారు.
'మగమహారాజు' హండ్రెడ్ డేస్ ఫంక్షన్ సందర్భంగా ఆయన నాకు ఒక ఏనుగునే కానుకగా ఇచ్చారు. అలాగే ఒకే రోజు 'గ్యాంగ్ లీడర్' 100 డేస్ ఫంక్షన్ ను నాలుగు సిటీల్లో జరిపించిన రికార్డు మా కాంబినేషన్లో వుంది. అలా నన్నెంతో అమితంగా అభిమానించిన విజయబాపినీడుగారిని కోల్పోవడం నాకెంతో బాధాకరంగా వుంది" అని చెప్పుకొచ్చారు.