Saudi Arebia: రెండు రోజుల పర్యటన కోసం... ఐదు ట్రక్కుల నిండా సరంజామాను పంపిన సౌదీ రాజు!
- పాక్ లో రెండు రోజుల పర్యటన
- డైనింగ్ టేబుల్ నుంచి సమస్తం తరలింపు
- ఇంకా ఖరారు కాని పర్యటన తేదీలు
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్ లో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎప్పుడో మాత్రం చెప్పలేదు. అయితేనేం, ఐదు ట్రక్కుల నిండా ఆయన వాడేందుకు అవసరమైన సరంజామా ఇస్లామాబాద్ కు చేరుకుంది. పాకిస్థాన్ తో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆయన వస్తుండగా, నిత్యమూ ఆయన వాడే వ్యాయామ పరికరాలు, డైనింగ్ టేబుల్, వాష్ బేసిన్, చైర్స్ సహా ఫర్నీచర్ ఆసాంతం పాక్ చేరుకుంది. ఈ విషయాన్ని సౌదీ ఎంబసీ అధికారులు స్వయంగా వెల్లడించారంటూ 'డాన్ న్యూస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
రాజు సెక్యూరిటీ టీమ్ కూడా చేరుకుందని, సౌదీ నుంచి మీడియా కూడా వచ్చి ఆయన రాక కోసం ఎదురు చూస్తోందని చెప్పింది. కాగా, పట్టాభిషేకం తరువాత మహమ్మద్ పాక్ లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. గతంలో ఆయన రక్షణ మంత్రిగా ఉన్న వేళ ఓ మారు పాక్ లో పర్యటించారు. కాగా, ఆయన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోనే బస చేస్తారని, మరో రెండు టాప్ హోటళ్లను కూడా సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఇమ్రాన్ ఖాన్ తో పాటు సైనికాధికారులతోనూ ప్రత్యేక చర్చలు జరపనున్నారు.