Gujjar: నాలుగో రోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన.. రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున రైళ్ల బంద్
- శుక్రవారం నుంచి కొనసాగుతున్న ఆందోళన
- 250 రైళ్ల రాకపోకలపై ప్రభావం
- రైళ్లను రద్దు చేస్తున్న అధికారులు
రాజస్థాన్‌లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన నాలుగో రోజుకు చేరింది. విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు రైలు పట్టాలను వదిలేది లేదని ఆందోళనకారులు భీష్మించుకుని కూర్చున్నారు. ఆందోళనకారులు పట్టాలను వీడకపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
సోమవారం 21 రైళ్ల రాకపోకలను నిలిపివేసిన అధికారులు 18 రైళ్లను దారి మళ్లించారు. నేడు 21 రైళ్లను రద్దు చేసి, 8 రైళ్లను దారి మళ్లించారు. అలాగే, బుధవారం నడవాల్సిన 15 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఆందోళన ప్రభావం ఈ ప్రాంతం గుండా నడిచే 250కిపైగా రైళ్లపై పడింది. కాగా, ఆదివారం గుజ్జర్లు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది.