india: ఉత్కంఠభరిత పోరులో భారత్ ఓటమి.. సిరీస్ ను కైవసం చేసుకున్న కివీస్
- 4 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఇండియా
- చివర్లో కార్తీక్, పాండ్యా చెలరేగినా దక్కని ఫలితం
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మన్రో
హామిల్టన్ లో న్యూజిలాండ్ తో ఉత్కంఠభరితంగా జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. తద్వారా 3 టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
213 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 6 పరుగులకే ధావన్ (5) వికెట్ ను కోల్పోయింది. అనంతరం రోహిత్ శర్మ 38, విజయ్ శంకర్ 43 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్ ను నిర్మించారు. వీరిద్దరూ కలిసి 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్కోరు 81 పరుగులు ఉన్నప్పుడు విజయ్ శంకర్ ఔటయ్యాడు.
అనంతరం బరిలోకి దిగిన యువ ఆటగాడు రిషభ్ పంత్ 12 బంతుల్లో 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం 11 బంతుల్లో 21 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేరాడు. కేవలం 2 పరుగులే చేసి ధోని నిరాశపరిచాడు. చివర్లో దినేష్ కార్తీక్ 16 బంతుల్లో 33 పరుగులు (4 సిక్సర్లు), కృణాల్ పాండ్యా 13 బంతుల్లో 26 పరుగుల (2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో చెలరేగిపోయారు. చివరి బంతిని కార్తీక్ సిక్సర్ గా మలిచాడు. ఇంకో బంతి మిగిలి ఉంటే భారత్ గెలిచేదేమో. కివీస్ బౌలర్లలో శాంట్నర్, మిచెల్ లు చెరో 2 వికెట్లు తీయగా... కుగ్లీన్, టిక్నర్ లు చెరో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు కివీస్ ఓపెనర్లు మన్రో 72, సీఫ్రెట్ 43 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం విలియంసన్ 27, గ్రాండ్ హోమ్ 30 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మిచెల్ 19, టేలర్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో కుల్డీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా... భువనేశ్వర్, అహ్మద్ లు చెరో వికెట్ తీశారు. 72 పరుగులు చేసిన కివీస్ బ్యాట్స్ మెన్ మన్రోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సీఫ్రెట్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.