Hyderabad: బీసీల రిజర్వేషన్ పై చట్టసభల్లో చర్చ జరపాలని జగన్ ని కోరాను: ఆర్. కృష్ణయ్య
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2ae1488536d28e0ecbec3bf9c7c56395ef250eb2.jpg)
- వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ని కలిసిన కృష్ణయ్య
- జగన్ కు వినతి పత్రం అందజేత
- రాజ్యసభలో ప్రస్తావిస్తామన్న వైసీపీ అధినేత
బీసీల రిజర్వేషన్ పై చట్టసభల్లో చర్చ జరపాలని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ని కోరినట్టు బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఈరోజు ఆయన వెళ్లారు. భేటీ అనంతరం మీడియాతో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ మేరకు ఓ వినతిపత్రం జగన్ కు అందజేసినట్టు చెప్పారు. ఈ అంశం గురించి రాజ్యసభలో తమ పార్టీ తరపున మాట్లాడతామని జగన్ హామీ ఇచ్చారని, ఈ నెల 17న ఏలూరులో నిర్వహించే ‘బీసీ గర్జన’ సభకు తనను హాజరు కావాల్సిందిగా ఆయన కోరినట్టు తెలిపారు. బీసీల కోసం ఏ పార్టీ వారు సభ నిర్వహించినా వెళతానని స్పష్టం చేశారు.