Subramanian swamy: బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు.. ఆదాయ పన్ను పూర్తిగా ఎత్తివేయాలని సూచన
- మూడు దశాబ్దాల క్రితం 3.5 శాతం వృద్ధి రేటు సాధిస్తే గొప్ప అనుకున్నారు
- ఏడు శాతం వృద్ధి రేటు పీవీ పుణ్యమే
- ఆదాయపు పన్నుతో వేధింపులకు గురయ్యేది మధ్యతరగతి వారే
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టైమ్స్ నౌ’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన సుబ్రహ్మణ్యస్వామి.. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తొలుత ఆదాయపన్నును తొలగించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారు ఎలాగూ పన్ను చెల్లించరని, ధనవంతుల వద్ద చార్టర్డ్ అకౌంటెంట్లు ఉంటారు కాబట్టి వారు చెల్లించేది కూడా బహు స్వల్పమేనని పేర్కొన్నారు.
ఇక మిగిలింది మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులేనని వారికి నిలకడగా కొంత ఆదాయం ఉంటుందని, కాబట్టి పన్ను వేధింపులకు గురయ్యేది వారు మాత్రమేనంటూ లాజిక్ చెప్పుకొచ్చారు. ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయడం వల్ల ప్రజలకు మేలు జరగడంతోపాటు ఎన్నో లాభాలు కూడా ఉంటాయన్నారు.
కొనుగోలు శక్తిలో భారత్ చైనా, అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉన్నా వృద్ధి రేటు మాత్రం ఏడు శాతం మాత్రమేనని స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తనది అత్యాశ అనుకున్నా పరవాలేదు కానీ వృద్ధి రేటు పది శాతం కన్నా ఎక్కువగా ఉండాలనే తాను కోరుకుంటానన్నారు.
60, 70వ దశకాల్లో 3.5 శాతం వృద్ధి రేటు సాధిస్తే అదే గొప్ప అని అనుకున్నారని, కానీ పీవీ నరసింహారావు పుణ్యమా అని ఆయన సంస్కరణల వల్ల 7-8 శాతం వృద్ధి రేటు సాధించగలిగినట్టు గుర్తు చేశారు.