Hyderabad: లక్షలు పలికే '9999' నంబర్ ను రూ. 50 వేలకే దక్కించుకున్న బొంతు రామ్మోహన్!
- ఫ్యాన్సీ నంబర్లను వేలం వేసిన ఆర్టీయే అధికారులు
- ఒక్కరోజులో రూ. 14 లక్షలకు పైగా ఆదాయం
- '9999'కు బొంతు రామ్మోహన్ నుంచి మాత్రమే దరఖాస్తు
- ఇతరులపై ఒత్తిడి తెచ్చారని చర్చ!
'9999'... ఎక్కడో అడపా దడపా మాత్రమే రోడ్లపై ఈ నంబర్ తో వాహనం కనిపిస్తుంది. బడా పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులు, సినీ స్టార్లు ఈ ఫ్యాన్సీ నంబర్ ను లక్షలు వెచ్చించి కొంటుంటారు. కానీ, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు మాత్రం ఈ నంబర్ కేవలం రూ. 50 వేలకే దక్కడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా తెలంగాణ 09 సిరీస్ తో 'ఎఫ్డీ 9999' వేలానికి వచ్చింది.
దీని రిజర్వ్ ధరను రూ. 50 వేలుగా రవాణా శాఖ నిర్ణయించగా, అంతే మొత్తానికి బొంతు రామ్మోహన్ సొంతం చేసుకున్నారు. ఆయన ఒక్కరే ఈ నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, పోటీకి మరెవరూ రాలేదని అధికారులు అంటున్నా, అధికారుల ఒత్తిడి కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. కాగా, తెలంగాణలో '9999' నంబరుకు ఇంతకుముందు రూ. 7 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకూ ధర పలికింది. ఇటీవల కేరళలో ఓ వ్యక్తి రూ. 31 లక్షలకు ఈ నంబర్ ను తీసుకున్నాడు. ఇంత ఫ్యాన్సీ నంబర్ కు కేవలం రూ. 50 వేలే రావడం కూడా ఓ రికార్డే మరి.
తాజాగా హైదరాబాద్ ఆర్టీయే కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం సాగగా, ఒక్క రోజులో రూ. 14.59 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. '0009'కు రూ. 2.10 లక్షలు, '0099'కు రూ. 1.35 లక్షలు లభించాయి.