himalayas: హిమాలయాల్లో సగానికి పైగా మంచు కరిగిపోనుంది: ఐసీఐఎండీ
- ఈ శతాబ్దం చివరకల్లా రాతికొండల్లా మారనున్న హిమగిరులు
- వేడెక్కుతున్న వాతావరణం, గ్రీన్ హౌస్ వాయువులే కారణం
- ఎనిమిది దేశాలపై చూపనున్న ప్రభావం
హిమాలయ పర్వతాల్లో మూడింట రెండు వంతుల శాతం మంచు కరిగిపోబోతోందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్ మెంట్ సంస్థ (ఐసీఐఎండీ) తెలిపింది. తెల్లటి మంచుతో కప్పబడిన హిమగిరులు... మంచు కరిగిపోయి, రాతి కొండల్లా మిగిలిపోతాయని చెప్పింది. ఈ శతాబ్దం చివరి నాటికి ఇది జరగబోతోందని హెచ్చరించింది. మారుతున్న వాతావరణం, గ్రీన్ హౌస్ వాయువులు దీనికి కారణమని చెప్పింది. వాతావరణ మార్పులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సక్రమంగా చేపట్టకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తన అధ్యయనంలో వెల్లడించింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆసియా ఖండంలోని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలపై తీవ్రంగా ఉంటుందని ఐసీఐఎండీ తెలిపింది. హిమాలయాల నుంచి స్వచ్ఛమైన నీరు 10 ప్రధానమైన నదుల ద్వారా ప్రవహించి 190 కోట్ల మంది ప్రజల అవసరాలను తీరుస్తోందని చెప్పింది. హిమాలయాల్లోని మంచు కరిగిపోతే, నదులు ఎండిపోతాయని... తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని హెచ్చరించింది. ఈ దేశాల్లోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని చెప్పింది. ఈ దేశాల్లో ఇప్పటికే ఆహార అభద్రత నెలకొందని తెలిపింది.
హిమాలయాల్లో మంచు కరగడం వల్ల భారీ వరదలు లేదా తీవ్ర కరవు నెలకొనే అవకాశాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల ఈ ఎనిమిది దేశాల్లోని ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది.
ఈ సందర్భంగా ఐసీఐఎండీ చీఫ్ సైంటిస్ట్ ఫిలిప్పస్ వెస్టర్ మాట్లాడుతూ, మారుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయని చెప్పారు. వాతావరణ పరిరక్షణకు సంబంధించి అత్యవసర చర్యలు అవసరమని అన్నారు.