forest departmnt: స్మగ్లర్లతో చెట్టాపట్టాలు.. తెలంగాణ అటవీ శాఖ సిబ్బందిపై బదిలీల వేటు!

  • ఒకేసారి 200 మందికి స్థాన చలనం
  • విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన వారిపై బదిలీ వేటు
  • పలువురి సస్పెన్షన్‌

అటవీ శాఖ పరిధిలో భారీగా బదిలీలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల రక్షణను విస్మరించి స్మగ్లర్లతో అంటకాగుతున్న అధికారులు, సిబ్బంది జాబితా తయారు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉన్నతాధికారులు పలువురి పేర్లతో జాబితా రూపొందించారు. దీన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి సదరు అధికారుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, చీఫ్‌ కన్జర్వేటర్లు, కన్జర్వేటర్లు, డీఎఫ్‌ఓ, ఎఫ్‌డీఓ, ఏసీఎస్‌ స్థాయి అధికారులు 200 వందల మందిపై బదిలీ వేటు పడింది. విధుల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదని చెప్పకనే చెప్పింది. కొందరి చేతికి అప్పుడే సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందాయి.

పెద్దపులి, చిరుతపులి మరణాల కేసులో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జె.వెంకటేశ్వరరావును బదిలీ చేశారు. ఇచ్చోడలో నీల్గాయి వేటలో నిందితులకు సహకరించి, పెద్దపులి చర్మం ఒలిచిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై బీట్, సెక్షన్, రేంజ్ ఆఫీసర్లను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది.

‘జంగల్‌ బచావో...జంగల్‌ బడావో’ నినాదంతో ఓవైపు స్మగ్లర్లు, అటవీ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూనే నిర్లక్ష్యపు అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఉత్తర తెలంగాణ పరిధిలో అడవులు, అభయారణ్యాలు ఉన్న ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చాలామందికి బదిలీ అయ్యింది. కవ్వాల్ పెద్దపులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ శరవణన్‌ను బదిలీచేసి ప్రస్తుతం అచ్చంపేట, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వినోద్‌కుమార్‌ను ఆయన స్థానంలో నియమించారు.

చీఫ్ కన్జర్వేటర్‌ స్థాయి అధికారి ఎస్కే సిన్హాకు అమ్రాబాద్ అభయారణ్యంలో ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నదని, అక్కడ అటవీ సంపదను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లెందు, కాగజ్‌నగర్, ఇచ్చోడకు కొత్త డీఎఫ్‌వోలను నియమించారు.

forest departmnt
transfers
KCR
  • Loading...

More Telugu News