Chandrababu: వీరిద్దరు తప్ప బెంగాల్ చర్యను అంతా ఖండించారు: చంద్రబాబు
- కేసీఆర్, జగన్ లు మోదీ కనుసన్నల్లో ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైంది
- రాష్ట్ర బడ్జెట్ పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది
- కుల, మతాల పేరుతో అమాయకులకు వల పన్నుతున్నారు
పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకున్న దారుణ పరిణామాలపై అందరూ స్పందించారని... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ మాత్రం బెంగాల్ చర్యను ఖండించలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వీరిద్దరూ ప్రధాని మోదీ కనుసన్నల్లో ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందని చెప్పారు. టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. బడ్జెట్ పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోందని చెప్పారు. పేదరిక నిర్మూలనే తమ కులమని, పేదరికంలో ఉన్నవారికి తోడ్పాటు అందించే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాల ప్రజలను పైకి తీసుకొస్తామని చెప్పారు. కుల, మత విద్వేషాలతో అమాయకులకు వల పన్నుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయం పండుగ పేరిట రైతులకు చెక్కులిచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని చెప్పారు.