Andhra Pradesh: చంద్రబాబుతో నేడు కేఈ ఫ్యామిలీ భేటీ.. మంత్రి ఆదినారాయణ రెడ్డికి లోక్ సభ టికెట్!
- టీడీపీ అధినేతతో రాయలసీమ నేతల భేటీ
- డోన్ అసెంబ్లీ సీటుపై కేఈ ఫ్యామిలీ ఆశలు
- రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు టికెట్ ఇచ్చే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈరోజు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం భేటీ కానుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడంపై తమ అభిప్రాయాన్ని, అభ్యంతరాలను కేఈ ఫ్యామిలీ చంద్రబాబుకు విన్నవించనుంది. ప్రధానంగా డోన్ అసెంబ్లీ స్థానాన్ని తమకే కేటాయించాలని కేఈ కృష్ణమూర్తి వర్గీయులు కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కడప జిల్లా నేత, ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి-రామసుబ్బారెడ్డిలతో ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు భేటీ కానున్నారు. వీరిలో ఒకరిని కడప పార్లమెంటు సభ్యుడిగా, మరొకరిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా కడప పార్లమెంటు స్థానం, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు విషయమై ఈ ఇద్దరు నేతలతో ముఖ్యమంత్రి పలుమార్లు సమావేశమయ్యారు.
ఎవరు ఎక్కడ నుండి పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఇద్దరికీ సూచించారు. అయితే, ఇద్దరూ తమకు జమ్మలమడుగు అసెంబ్లీ సీటే కావాలంటూ పట్టుబట్టారు. ఈ విషయంలో సయోధ్య కుదరకపోవడంతో తుది నిర్ణయాన్ని నేతలు చంద్రబాబుకే వదిలేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఆదినారాయణ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.