Karnataka: ‘తల్వార్’ తో బర్త్ డే కేకు కోసిన బీజేపీ నేత.. జైలులో కూర్చోబెట్టిన పోలీసులు!
- కర్ణాటకలోని బెళగావిలో ఘటన
- యువమోర్చా నేత నిఖిల్ బర్త్ డే వేడుకలు
- గతంలోనే 8 కేసులు నమోదు
మన టైమ్ బాగోలేకపోతే ఏం చేసినా ఇబ్బందుల్లో పడతామని చెప్పడానికి తాజా ఘటనే ఉదాహరణ. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నందుకు ఓ బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకుంది.
బీజేపీ అనుబంధ సంస్థ యువమోర్చా బెళగావి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నిఖిల్ రవి అనుచరులతో కలిసి ఈ నెల 1న తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొడవాటి తల్వార్(కత్తి)తో బర్త్ డే కేకును కోశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఖిల్ రవిని అరెస్ట్ చేసి హిండల్గా జైలుకు పంపారు. కాగా, నిఖిల్ పై ఇప్పటికే రౌడీషీట్ తో పాటు 8 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.