Andhra Pradesh: చర్చలు సఫలం.. రేపటి నుంచి తలపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
- ఆర్టీసీ నాయకులతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చలు
- ఈ చర్చల్లో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు
- పాల్గొన్న ఈయూ, కార్మిక పరిషత్ సహా 9 సంఘాలు
రేపటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను విరమించారు. ఆర్టీసీ ఐకాస నాయకులతో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నోటీసులోని 18 డిమాండ్ల పరిష్కారంపై ఐకాస నాయకులతో అచ్చెన్నాయుడు చర్చించారు. ఈ చర్చల్లో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఉన్నతాధికారులు, ఈయూ, కార్మిక పరిషత్ సహా 9 సంఘాల నేతలు పాల్గొన్నారు.
డీజిల్ ధరల పెరుగుదలతో నష్టాలు తగ్గించుకోలేకపోతున్నాం: అచ్చెన్నాయుడు
చర్చల అనంతరం మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు తాత్కాలికంగా 25 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, భవిష్యత్ లో ఎన్జీవోలకు సమానంగా ఫిట్ మెంట్ కల్పిస్తామని హామీ ఇచ్చామని అన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.750 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందేనని, యాజమాన్యం పొదుపు పాటించడం వల్ల ఆ నష్టాలను తగ్గిస్తూ వస్తున్నామని అన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో నష్టాలను తగ్గించుకోలేకపోతున్నామని, ఆర్టీసీలో ‘పల్లె వెలుగు’ సహా పలు విభాగాల్లో భారీగా నష్టాలు వస్తున్నట్టు చెప్పారు.
పాతబకాయిలను 2020 నాటికి చెల్లించాలని కార్మికులు కోరారని, ఈ విషయమై ఆర్టీసీ ఎండీ, చైర్మన్ సమావేశమై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పామని అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ప్రజలపై ఎటువంటి భారం మోపలేదని చెప్పిన అచ్చెన్నాయుడు, ఆర్టీసీలో 62 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేటును 80 శాతానికి చేర్చినట్టు చెప్పారు.