jagan: డీజీపీపై జగన్ ఆరోపణలు సరికాదు: చినరాజప్ప
- ఏపీ డీజీపీ ఠాకూర్ సమర్థవంతంగా పని చేస్తున్నారు
- కోర్టు తీర్పు ప్రకారం కొందరికి ప్రమోషన్లు ఇచ్చాం
- జగన్ పై ఉన్న కేసులను ఎత్తి వేసేందుకు కేంద్రం యత్నిస్తోంది
ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమర్థవంతంగా పని చేస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన అధికారులకు పదోన్నతులు ఇస్తున్నామనే వైసీపీ అధినేత జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. కోర్టు తీర్పు ప్రకారమే కొందరికి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. డీజీపీపై జగన్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. పదోన్నతులు, పోస్టింగ్ లపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జగన్ పై ఉన్న కేసులను ఎత్తి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిన్న జగన్ కలిసిన సంగతి తెలిసిందే. డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా కోరారు. వారు విధుల్లో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులకు పెద్ద ఎత్తున ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు.