Sravani: ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఇద్దరమ్మాయిల సాహసం!
- ఈ నెల ప్రారంభంలో పానగల్ జలాశయం వద్ద దుస్తులు, బ్యాగ్ లు
- మృతదేహాలు కూడా దొరకవంటూ లేఖరాసి పెట్టిన అమ్మాయిలు
- కేసును ఛేదించి, వారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు
ఇద్దరమ్మాయిలు సాహసమే చేశారు. తాము చనిపోతున్నామని లెటర్ రాసి పెట్టి ఎటో వెళ్లిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారిద్దరి ఆచూకీ తెలుసుకుని, వారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా చిన్నకొండూరుకు చెందిన శ్రావణి (17), రంగారెడ్డి జిల్లా ఆమనగల్ కు చెందిన రేష్మా (18). ఇద్దరికీ హైదరాబాద్ లోని ఓ కాలేజీలో చదువుతున్న సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బలమైన బంధం వారిది. ఇంటర్ తరువాత రేష్మాను ఆమె తల్లిదండ్రులు నల్గొండలోని డీఈడీ కాలేజీలో చేర్పించారు. దీంతో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది.
తనకు ఆరోగ్యం బాగాలేదని, దీంతో ఆత్మహత్య చేసుకోనున్నానని లేఖ రాసిన శ్రావణి తొలుత ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. ఆపై రేష్మను కలిసి ఇద్దరూ పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ వద్దకు వెళ్లి, ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ మృతదేహాలు కూడా లభించవని లేఖ రాసి, తమ వద్ద ఉన్న బ్యాగులు, చెప్పులు, దుస్తులు రిజర్వాయర్ ఒడ్డున విడిచి, సమీపంలోని రైల్వే స్టేషన్ కు చేరి, అక్కడి నుంచి గుంటూరువైపు వెళ్లిపోయారు. అక్కడి నుంచి తొలుత చెన్నైకి, అటునుంచి ముంబైకి, గుజరాత్ లోని వడోదరాకు పోయారు. అయితే ఇద్దరమ్మాయిలకూ ఎక్కడా వసతి లభించలేదు. దీంతో ఏం చేయాలో తెలియని వారు తిరిగి విజయవాడకు వచ్చారు. అయితే, వీరిద్దరూ తమతో పాటు హాస్టల్ లో ఉన్న ఓ అమ్మాయితో కాంటాక్ట్ లో ఉండటంతో ఆమె నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు ఇద్దరినీ విజయవాడలో అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.