jagan: ఆ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఈసీని కోరాం: జగన్
- ఏపీలో 60 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి
- 4 లక్షలకు పైగా వైసీపీ ఓట్లను తొలగించారు
- సొంత సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులకు చంద్రబాబు ప్రమోషన్లు ఇస్తున్నారు
రాష్ట్రంలోని 3.69 కోట్ల ఓట్లలో దాదాపు 60 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత భ్రష్టు పట్టించారో చెప్పడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. ఈ 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయని తెలిపారు. మిగిలిన 40 లక్షల ఓట్లు ఏపీలోనే నమోదయ్యాయని చెప్పారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశామని చెప్పారు. కాసేపటి క్రితం ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను జగన్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
రకరకాల సర్వేల ద్వారా వైసీపీ సానుభూతిపరులను గుర్తించి... వారి ఓట్లను తొలగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. 4 లక్షలకు పైగా ఓటర్లను ఈ విధంగా తొలగించారని దుయ్యబట్టారు. పోలీసు, అధికార వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. చంద్రబాబుకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. 37 మంది సీఐలను డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే... అందులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు 35 మంది ఉన్నారని చెప్పారు. ఈ జాబితాను కూడా ఎన్నికల సంఘానికి అందించామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులకు చంద్రబాబు ప్రమోషన్ ఇస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు కనుసన్నల్లో డీజీపీ పని చేస్తున్నారని... తనపై హత్యాయత్నం జరిగిన గంటలోనే చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకున్న డీజీపీ మీడియాతో మాట్లాడారని చెప్పారు. డీజీపీతో పాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని... అప్పుడే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఈసీని కోరామని తెలిపారు. ఎన్నికల కోసం ఇప్పటికే రూ. 4వేల కోట్ల అవినీతి డబ్బును ఆయా నియోజక వర్గాలకు చంద్రబాబు తరలించారని ఆరోపించారు. ఈసీకి అన్ని ఆధారాలను సమర్పించామని... అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు.