Facebook: ఓ నెల రోజులు ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటే ఇక ఆనందమే..తాజా అధ్యయనంలో వెల్లడి!
- వ్యక్తిగత జీవితంలో భాగంగా మారిన ఫేస్బుక్
- న్యూయార్క్-స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనం
- ఆసక్తికర విషయాలు వెల్లడి
ఫేస్బుక్.. ప్రజల జీవితాల్లో ఇప్పుడు ఇదో భాగమైపోయింది. తిండి, నిద్రతోపాటు ఫేస్బుక్ కూడా జీవితంలో ఒకటిగా మారింది. ప్రజల జీవితాల్లో పెనవేసుకుపోయిన ఈ ఫేస్‌బుక్‌కు ఓ నెల రోజులపాటు దూరంగా ఉంటే జీవితంలో చెప్పలేనంత ఆనందంగా ఉంటారని న్యూయార్క్ యూనివర్సిటీ-స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
ఫేస్‌బుక్‌కు దూరంగా ఉన్నవారు తాము మునుపటికంటే మరింత ఆనందంగా ఉన్నట్టు చెప్పారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో గడపే సమయాన్ని తగ్గించుకున్న వారు కుటుంబం కోసం, చదువు కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు కనుగొన్నారు. ‘వెల్ఫేర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు పరిశోధనకారులు తెలిపారు. ఇందుకోసం 2,844 మందిపై అధ్యయనం చేసినట్టు వివరించారు.