kolkata: కోల్ కతా పోలీస్ కమిషనర్ ని ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులు.. చుక్కలు చూపించిన పోలీసులు!
- పోలీస్ కమిషనర్ ని ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ
- వారిని అడ్డుకున్న పశ్చిమ బెంగాల్ పోలీసులు
- రాజీవ్ కుమార్ నివాసానికి వెళ్లిన మమతా బెనర్జీ
శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ పొంజి కుంభకోణం కేసుల్లో పశ్చిమ బెంగాల్ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు చుక్కలు కనపడ్డాయి. రాజీవ్ కుమార్ నివాసానికి వెళ్లిన సుమారు 40 మంది సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అడ్డుకుని, వారి ఆధారాల గురించి ఆరా తీశారు. కొందరు అధికారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీబీఐ అధికారులను ఉంచిన పోలీస్ స్టేషన్ తలుపులను మూసి వేసి, అక్కడికి మీడియాను కూడా అనుమతించ లేదని సమాచారం. ఈ సమాచారం నేపథ్యంలో రాజీవ్ కుమార్ ఇంటికి సీఎం మమతా బెనర్జీ వెళ్లారు.
కాగా, ఈ కుంభకోణాలకు సంబంధించిన కేసులను రాజీవ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి మాయమైన దస్త్రాల విషయమై ఆయన్ని ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ అధికారులు చెప్పినట్టు సమాచారం. సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపినా స్పందించలేదని సదరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, విధుల పట్ల రాజీవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఖండిస్తున్నారు.