America: చేతికి మట్టి అంటకుండా బ్యాంకును దోచేయాలనుకున్నారు.. చివరికి మట్టే కొంప ముంచింది!
- బ్యాంకు దోపిడీకి రోడ్డు కింది నుంచి సొరంగం
- రోడ్డు కుంగడంతో విషయం వెలుగులోకి
- అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
చేతికి మట్టి అంటుకోకుండా బ్యాంకును దోచేయాలని ఓ దొంగల ముఠా ప్లాన్ చేసింది. తుపాకులతో బ్యాంకులోకి వెళ్లడం, వాటిని చూపించి బ్యాంకు సిబ్బందిని బెదిరించడం.. ఇదంతా పెద్ద ప్రహసనమని భావించిన దొంగలు రోడ్డు కింది నుంచి బ్యాంకు వరకు సొరంగం తవ్వేశారు. అయితే, దురదృష్టం వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన.
రోడ్డుకు ఆ వైపున ఉన్న బ్యాంకుకు ఈ వైపు నుంచి రోడ్డు కిందగా సొరంగం తవ్వడం మొదలుపెట్టిన దొంగలు ఎట్టకేలకు దానిని పూర్తి చేశారు. బ్యాంకు వరకు సొరంగాన్ని తవ్వేసిన దొంగలు బ్యాంకును దోచుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే జరగరానిది జరిగింది.
రోడ్డు మీది నుంచి ఓ భారీ వాహనం వెళ్లడంతో రోడ్డు కుంగింది. సమాచారం అందుకున్న మునిసిపల్ సిబ్బంది గుంతను పూడ్చే పనులు చేపట్టారు. అయితే, ఎంత మట్టి వేస్తున్నా గుంత పూడకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించగా సొరంగం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి ఆశ్చర్యపోయారు. సొరంగం బ్యాంకు వరకు వెళ్లి ఆగిపోవడంతో అది దొంగల పనేనని నిర్ధారించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.