Vijaymalya: ఇంత అన్యాయమా? రూ. 4 వేల కోట్లు ఎక్కువ జప్తు చేశారు!: విజయ్ మాల్యా గగ్గోలు
- నేను చెల్లించాల్సింది రూ. 9 వేల కోట్లు
- జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 13 వేల కోట్లు
- ట్విట్టర్ లో విజయ్ మాల్యా
తాను ఇండియాలోని బ్యాంకులకు వడ్డీలను కూడా కలిపి రూ. 9 వేల కోట్లు చెల్లించాల్సి వుంటే, ఈడీ, బ్యాంకులు తన గ్రూప్ సంస్థలకు చెందిన రూ. 13 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారని యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ఆరోపించారు. తనపై ఆర్థిక నేరస్తుడిగా ముద్రవేసి, తాను ఇవ్వాల్సిన మొత్తం కన్నా, జప్తు చేసింది ఎక్కవని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ, ఇది సరైన చర్యేనా? అన్నారు. తన నుంచి రుణాల వసూలు పేరిట లాయర్ల ఖర్చుల కోసం బ్యాంకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయని, దీనికి ఎవరు జవాబుదారీ? అని విరుచుకుపడ్డారు. తాను చెల్లించాల్సిన రుణాల కన్నా రూ. 4 వేల కోట్లను అదనంగా పట్టుకుని కూర్చున్నారని ఆరోపించారు. కాగా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన మాల్యా, లండన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ను ఎలాగైనా ఇండియాకు తీసుకు రావడానికి సీబీఐ, ఈడీ తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి.