Andhra Pradesh: కోడికత్తి కేసులో ఏం దొరికింది.. కోడి గుడ్డుపై ఈకలు పీకారు!: చంద్రబాబు సెటైర్లు
- జగన్ కేసులను నీరుగార్చబోతున్నారు
- కేసీఆర్-జగన్ కలవబోతున్నారు
- సీఎంగా మోదీ ఎన్ఐఏ చట్టం వద్దన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ పెట్టించిన కొత్త ప్రపోజల్ పేరే ఫెడరల్ ఫ్రంట్ అని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ ఫెడరల్ ఫ్రంట్ వేదికగా కేసీఆర్, జగన్ కలిసి ఇక్కడ రాజకీయం చేయబోతున్నారని విమర్శించారు. తాను యూటర్న్ తీసుకున్నానని విపక్షాలు ఆరోపిస్తున్నాయనీ, తనది ఎన్నటికీ రైట్ టర్నేనని వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తున్నది ధర్మపోరాటమనీ, అందులో అంతిమ విజయం తమదేనని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు మాట్లాడిన చంద్రబాబు.. కేంద్రంతో పాటు వైసీపీ, టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.
జగన్ పై నమోదయిన కేసులను బీజేపీ నీరుగార్చబోతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క జగన్ మాత్రమే కాకుండా ఆర్థిక నేరగాళ్లందరినీ కాపాడేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇప్పుడు నోటీసులు పంపించి వేధిస్తున్నారని విమర్శించారు. కోడి కత్తి కేసులో ఎన్ఐఏకు జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఎన్ఐఏ చట్టాన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇక జగన్ పై దాడి వ్యవహారంపై స్పందిస్తూ..‘ ఆ కోడి కత్తి కేసులో ఎన్ఐఏ అధికారులకు ఏమైనా దొరికిందా? కోడి గుడ్డుపై ఈకలు పీకారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ఏది చెప్పిందో, ఎన్ఐఏ అధికారులు కూడా అదే చెప్పారు’ అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.