movie industry: సినీ పరిశ్రమకు శుభవార్త.. సింగ్ విండోతో అన్ని అనుమతులు ఇచ్చేస్తామన్న కేంద్రం!
- సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందన్న గోయల్
- ఈ సౌకర్యం విదేశీయులకే ఉండేదని వ్యాఖ్య
- నిర్మాతలకు భారీగా నగదు, సమయం ఆదా
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సినీ పరిశ్రమకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇకపై సినీ పరిశ్రమ వర్గాలకు సింగిల్ విండో (ఏక గవాక్ష) ద్వారా అనుతులు జారీచేస్తామని తెలిపారు. అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదన్నారు. ఫిల్మ్ మేకర్లు ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని అన్నారు. ఇప్పటివరకూ విదేశీ ఫిల్మ్ మేకర్లకు మాత్రమే ఉన్న ఈ సౌకర్యాన్ని భారతీయులకూ వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పైరసీ సమస్యను నిర్మూలించేందుకు సినిమాటోగ్రఫి చట్టంలో కీలక మార్పులు తీసుకొస్తామని గోయల్ తెలిపారు. బాలీవుడ్ సహా వేర్వేరు సినీ పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఇటీవల ఓ థియేటర్ లో ’యూరీ’ సినిమా చూశానని, అదే చిత్రాన్ని పైరసీలో చూస్తే మాత్రం ఆ కిక్కు దొరకదని గోయల్ స్పష్టం చేశారు. గతంలో సినిమా థియేటర్లపై 50 శాతం పన్ను భారం పడేదనీ, కానీ ఎన్డీయే ప్రభుత్వం దీన్ని 12 శాతానికి (జీఎస్టీ) తగ్గించిందన్నారు. కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలోని సినిమా నిర్మాతలకు నగదు, సమయం భారీగా ఆదా కానున్నాయి.