India: మిత్రులారా.. ఖాకీ చెడ్డీలపై అమెరికన్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు!: ఒవైసీ సెటైర్లు
- అమెరికా సెనెట్ కు ఇంటెలిజెన్స్ చీఫ్ కోట్స్ నివేదిక
- ఎన్నికల నేపథ్యంలో మతఘర్షణలు జరగొచ్చని వార్నింగ్
- ట్విట్టర్ లో స్పందించిన మజ్లిస్ పార్టీ అధినేత
లోక్ సభ ఎన్నికలకు ముందు భారత్ లో మత ఘర్షణలు జరిగే అవకాశముందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కమిటీ చీఫ్ డేనియల్ కోట్స్ చెప్పిన సంగతి తెలిసిందే. మోదీ హిందుత్వ నినాదాన్ని తలకెత్తుకుంటే మత ఘర్షణలు తప్పకపోవచ్చనీ, తద్వారా ముస్లింలు భారతీయ సమాజంలో ఏకాకి అయిపోతారని స్పష్టం చేశారు. దీనివల్ల భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు సులభంగా ప్రవేశిస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సెనెట్ సెలక్ట్ కమిటీకి ఓ నివేదికను సమర్పించారు.
తాజాగా ఈ నివేదికపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మిత్రులారా.. ఖాకీ చెడ్డీలు వేసుకునేవారి(ఆరెస్సెస్) ఎన్నికల ప్రణాళికలపై ఇప్పుడు అమెరికన్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ భారతీయ ప్రజలు మాత్రం ఈ హింసను జరగనివ్వరు’ అని ట్వీట్ చేశారు. అలాగే డేనియల్ కోట్స్ నివేదికపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో ప్రచురితమైన కథనం లింక్ ను ఒవైసీ ఈ ట్వీట్ కు జతచేశారు.