unfortunate rains: చలిగుప్పిట తెలుగు రాష్ట్రాలు... అకాల వర్షాల ప్రభావంతో పడిపోయిన ఉష్ణోగ్రతలు
- గజగజ వణుకుతున్న జనం
- మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
- ఆదిలాబాద్ జిల్లాలో 5 డిగ్రీలు నమోదు
సంక్రాంతి తర్వాత సాధారణంగా చలి తగ్గుముఖం పడుతుంది. అయితే, ఈ ఏడాది పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. రాత్రిపూట జనం వణుకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల జనం ప్రస్తుతం చలిగుప్పిట చిక్కుకుని వణుకుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా కురిసిన భారీ వర్షాలతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీనికి ఉత్తరాది గాలులు కూడా తోడవ్వడంతో మరింత ప్రభావం చూపుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల పగటిపూట సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాయసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో ఆ జిల్లాల్లోనూ రాత్రిపూట తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిలో తేమ శాతం పెరిగింది.
ఉదయం 11 గంటల వరకు మంచు తెరలు విడిపోవడం లేదు. గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికీ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. చలికాలం ముగిసిపోయే దశలో ఈ స్థాయి చలి, గాలుల ప్రభావంతో జనం చికాకు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.